17 October 2026

దసరా 2026: విజయదశమి పండుగ ప్రాముఖ్యత, ఆయుధ పూజ మరియు రావణ దహనం చేసే సమయం

Start Chat

భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిలో దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నిజాయితీగా ఉండాలని, ధర్మం, నీతి, మంచి నడవడికతో జీవించాలని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. అధర్మం ఎంత బలంగా కనిపించినా, చివరికి గెలిచేది సత్యం, ధర్మమే అని ఈ పండుగ గుర్తుచేస్తుంది. విజయదశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించడం, దుర్గాదేవి మహిషాసురుడిని ఓడించడం ముఖ్యమైన ఘట్టాలుగా చెబుతారు. ఈ రోజు చెడుపై మంచి, అబద్ధంపై నిజం, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి గుర్తుగా భావిస్తారు మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి, ఆయుధ పూజ చేయడానికి, అలాగే మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని మరోసారి సంకల్పం చేసుకోవడానికి ఎంతో శుభప్రదమైన రోజుగా భావిస్తారు.

 

2026లో దసరా ఎప్పుడు జరుపుకుంటారు?

హిందూ పంచాంగం ప్రకారం, దసరాని విజయదశమి అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథి రోజున జరుపుకుంటారు. శరన్నవరాత్రులలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి వివిధ రూపాలను పూజించిన తర్వాత, పదో రోజున విజయదశమిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా శ్రీరాముడి విజయాన్ని, దుర్గాదేవి దివ్యశక్తిని భక్తితో స్మరించుకుంటారు.

ఈ ఏడాది ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్ష దశమి తిథి అక్టోబర్ 20న వస్తోంది. కాబట్టి, 2026లో దసరా పండుగని అక్టోబర్ 20న జరుపుకుంటారు.

 

ఆయుధ పూజ, రావణ దహనం చేయడానికి శుభ సమయం

విజయదశమి రోజున ఆయుధ పూజ చేసుకోవడానికి మరియు విజయాన్ని అందించే విజయ ముహూర్తానికి ఎంతో ప్రత్యేకత ఉంది. అక్టోబర్ 20, 2026 నాడు విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:59 నుండి 2:45 వరకు ఉంటుంది. అలాగే, పూజలకు ఎంతో అనువైన అపరాహ్ణ కాలం మధ్యాహ్నం 1:14 నుండి 3:30 వరకు ఉంటుందని చెప్పబడింది. ఈ సమయంలో భక్తిశ్రద్ధలతో ఆయుధ పూజ మరియు ఇతర శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.

దసరా పండుగలో అత్యంత ముఖ్యమైన వేడుక రావణాసురుడు, కుంభకర్ణుడు మరియు మేఘనాథుడి దిష్టిబొమ్మలను దహనం చేయడం. సూర్యాస్తమయం తర్వాత జరిగే ఈ రావణ దహనం… అధర్మం, అహంకారం, చెడు అంతమైపోవడానికి మరియు సత్యం, ధర్మం గెలవడానికి గుర్తుగా నిలుస్తుంది. అయితే, స్థానిక ఆచారాలు మరియు కార్యక్రమాల సమయాలను బట్టి రావణ దహనం చేసే సమయం ఊరు ఊరుకూ మారవచ్చు. అందుకే, ఖచ్చితమైన సమయం కోసం స్థానిక పంచాయగాలను లేదా నిర్వాహకులు ఇచ్చే అధికారిక ప్రకటనలను పరిశీలించడం మంచిది.

దసరా పండుగ శ్రీరాముడు, రావణుడి మధ్య జరిగిన యుద్ధానికి గుర్తుగా జరుపుకుంటారు. రామాయణం ప్రకారం, లంక రాజైన రావణుడు మోసం చేసి సీతమ్మవారిని అపహరించాడు. సీతమ్మవారిని రావణుడి చెర నుంచి విడిపించి, అధర్మాన్ని అంతం చేయడానికి శ్రీరాముడు వానర రాజు సుగ్రీవుడు, హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడు, వానర సైన్యం సహాయంతో లంకకు బయలుదేరాడు.

లంకలో శ్రీరాముడు, రావణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది. రావణుడు ఎంతో విద్యావంతుడు, బలవంతుడు. అనేక విషయాల్లో మంచి జ్ఞానం ఉన్నవాడు. అయినప్పటికీ, అతని అహంకారం, అన్యాయం, చెడు ప్రవర్తన చివరికి అతని పతనానికి కారణమయ్యాయి. చివరకు శ్రీరాముడు రావణుడిని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టి, సీతమ్మవారిని చెర నుంచి విడిపించాడు. ఈ విజయాన్ని గుర్తుచేసుకుంటూ విజయదశమి పండుగని జరుపుకుంటారు.

 

దుర్గాదేవి, మహిషాసురుడి మధ్య యుద్ధం

విజయదశమికి సంబంధించిన మరో ముఖ్యమైన ఘట్టం దుర్గాదేవి, మహిషాసురుడి మధ్య జరిగిన యుద్ధం. పురాణాల ప్రకారం, మహిషాసురుడు తన అపారమైన బలంతో అహంకారిగా మారి, దేవతలను, లోకాల్లోని ప్రజలను హింసించడం మొదలుపెట్టాడు. అతని బాధల నుంచి అందరినీ కాపాడటానికి దేవతలందరి దివ్యశక్తులు కలిసి దుర్గాదేవి అవతరించింది. ఆమె తొమ్మిది రోజుల పాటు మహిషాసురుడితో యుద్ధం చేసి, పదో రోజున అతడిని ఓడించింది. ఇలా ధర్మాన్ని కాపాడి, లోకంలో శాంతిని నెలకొల్పింది.

ఈ విజయాన్ని అధర్మంపై దైవశక్తి సాధించిన విజయంగా భావిస్తారు. శరన్నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించడం, పదో రోజున విజయదశమిని జరుపుకోవడం ఈ మత విశ్వాసానికి సంబంధించిన సంప్రదాయాలుగా కొనసాగుతున్నాయి.

 

దసరా పండుగ ప్రాముఖ్యత

విజయదశమి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనలోని చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. రావణుడి పది తలలు కామం, కోపం, అత్యాశ, మమకారం, గర్వం, అసూయ, అహంకారం, బద్ధకం, హింస, అన్యాయం వంటి చెడు లక్షణాలకు గుర్తుగా భావిస్తారు. ఈ భావన మనలోని చెడు లక్షణాలను గుర్తించి, వాటిని వదిలించుకోవడానికి ప్రేరణనిస్తుంది. 

శ్రీరాముడి జీవితం మనకు గౌరవం, దయ, నిజాయితీ, బాధ్యత వంటి మంచి లక్షణాలను నేర్పుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆయన ధర్మ మార్గాన్ని విడిచిపెట్టలేదు. అందుకే దసరా పండుగ మన రోజువారీ జీవితంలో నిజాయితీగా ఉండాలని, వినయంగా మెలగాలని, మంచి పనులు చేయాలని చెబుతుంది. ఈ దసరా రోజున మన ప్రవర్తనలో దయని పెంచుకోవాలని, స్వార్థం కంటే ఇతరులకు సహాయం చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని, అహంకారానికి బదులుగా వినయంతో ఉండాలని సంకల్పం చేసుకుందాం.

 

దసరా పూజా విధానం (పూజ చేసే పద్ధతి)

  • విజయదశమి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు, హనుమంతుడు, దుర్గాదేవిని భక్తితో పూజించాలి.
  • పూజ సమయంలో దీపం వెలిగించి, పూలు సమర్పించాలి. మీ ఆచారం, నమ్మకం ప్రకారం పండ్లు, స్వీట్లు, ఇతర పూజా సామగ్రిని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి.
  • దసరా రోజున ఆయుధ పూజ, వాహన పూజ, మన పనులకు ఉపయోగించే పరికరాలని పూజించడం కూడా సంప్రదాయంగా వస్తోంది. రైతులు తమ వ్యవసాయ పరికరాలని పూజించవచ్చు. వ్యాపారులు తమ వ్యాపార స్థలాల్లో పూజ చేసుకోవచ్చు.
  • పూజ చివర్లో మంచి మార్గంలో నడవడానికి అవసరమైన తెలివి, ధైర్యం, దైవ ఆశీస్సులు ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించాలి. పూజా విధానాలు, స్థానిక సంప్రదాయాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉండవచ్చు. కాబట్టి మీ కుటుంబ ఆచారాలను అనుసరించి పూజ చేసుకోవచ్చు.

 

దసరా రోజున దానం, సేవ చేయడం యొక్క ప్రాముఖ్యత

భారతీయ సంస్కృతిలో పండుగల ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడే ఆ ఆనందం పూర్తవుతుందని భావిస్తారు. సహాయం, ప్రేమ, ఆదరణ అవసరమైన వారితో మన సంతోషాన్ని పంచుకోవాలని విజయదశమి మనకు నేర్పుతుంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సహాయం చేయడం, దివ్యాంగులకు సేవ చేయడం ఈ పండుగ రోజున పుణ్యకార్యాలుగా భావిస్తారు.

మీకు ఉన్న స్థోమతని బట్టి పేదవారికి ఆహారం, నిత్యావసర వస్తువులు దానం చేసి, వారి జీవితాల్లో ఆశను, ఆనందాన్ని నింపండి.

 

దసరా పండుగ మనకు నేర్పించే జీవిత పాఠాలు

దసరా పండుగ మనకు చెప్పే గొప్ప విషయం ఏమిటంటే, బయట ఉన్న శత్రువులను ఓడించడం మాత్రమే విజయం కాదు. మనలో ఉన్న చెడు లక్షణాలను జయించడం కూడా అంతే ముఖ్యం. రావణుడి పతనం అహంకారం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో గుర్తుచేస్తుంది. శ్రీరాముడి జీవితం నిజాయితీ, సహనం, ధర్మం ఎంత గొప్పవో తెలియజేస్తుంది.

ఎన్ని కష్టాలు ఎదురైనా నిజం చెప్పడం, నిజాయితీగా ఉండటం మానకూడదని ఈ పండుగ మనకు నేర్పుతుంది. మన బలాన్ని ఇతరులను బాధించడానికి కాకుండా, వారిని కాపాడటానికి, ఆదుకోవడానికి ఉపయోగించాలి. వినయంతో కూడిన జ్ఞానం, మంచి ప్రవర్తనతో సాధించే విజయం, ఇతరులకు సేవ చేయాలనే మనసుతో కూడిన సంపద మన జీవితానికి నిజమైన అర్థాన్ని ఇస్తాయి.

ఈ విజయదశమి రోజున మనలోని అహంకారం, కోపం, అత్యాశ, ద్వేషాన్ని వదిలించుకోవాలని సంకల్పం చేసుకుందాం. మన రోజువారీ జీవితంలో దయ, ప్రేమ, వినయం, సేవాభావాన్ని అలవర్చుకుందాం. దేవుడిని ప్రార్థించి, పూజలు చేయడంతో పాటు అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తే, ఈ పండుగ ఆనందం మరింత అర్థవంతంగా మారుతుంది.

అందరికీ దసరా శుభాకాంక్షలు!

X
Amount = INR